: ఇప్పటి వరకూ ఇంకా పని మొదలు పెట్టలేదు... రంగంలోకి దిగుతున్నా: వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్
ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాము ఎలాంటి సర్వేలూ చేపట్టలేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. నిన్న వైకాపా అధినేత వైఎస్ జగన్ తో పాటు పార్టీ ముఖ్య నేతలను కలుసుకున్న ఆయన, కొన్ని మీడియాల్లో, సామాజిక మాధ్యమాల్లో వచ్చినట్టుగా తాము ఎలాంటి సర్వేలు చేయలేదని, ఇప్పటికింకా ఎన్నికల పనులే మొదలు పెట్టలేదని అన్నారు. తన బృందంతో రంగంలోకి దిగుతున్నానని, తమ ప్రవృత్తి సర్వేలు కాదని తేల్చి చెప్పారు.
తాను ఇప్పటికే సర్వేలు చేయించానంటూ వచ్చిన వార్తలు బోగస్ అని కొట్టి పడేశారు. పార్టీ పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఎలా ఉందోనన్న విషయమై తొలుత అంచనాలు వేయనున్నామని, తన బృందం పార్టీ నేతలతో మమేకమై కార్యకలాపాల సమన్వయానికి కృషి చేస్తుందని, జిల్లాల్లోనూ కొన్ని బృందాలు ఉంటాయని తెలిపారు. చిన్న చిన్న లోపాలుంటే వారే తమ దృష్టికి తెస్తారని చెబుతూ, తప్పులను సవరించుకుంటూ ముందుకు సాగాల్సి వుందని అన్నారు. కాగా, ఎల్లుండి నుంచి వైకాపా ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో వైకాపా నేతలకు ప్రశాంత్ కిశోర్ ను పరిచయం చేసేందుకు ఆయన్ను పిలిపించినట్టు వైకాపా వర్గాలు వెల్లడించాయి.