: మహిళల వరల్డ్ కప్: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. వరుస విజయాలతో దూకుడు!
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో టీమిండియా మహిళల జట్టు దూకుడు కొనసాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయాలు సాధించిన భారత జట్టు 8 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. బుధవారం డెర్బీలో జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 233 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రీలంక చతికిలపడింది. దీంతో శ్రీలంక వికెట్ కీపర్ దిలాని మండోదర (61) చేసిన ఒంటరి పోరాటం వృథా అయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి విజయానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది. భారత బౌలర్లలో ఝులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా దీప్తి శర్మ, ఎక్తా బిస్త్ చెరో వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్ విమెన్‌లలో దీప్తి శర్మ (78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. శ్రీలంక బౌలర్లలో శ్రీపాలి వీరక్కొడి 3 వికెట్లు పడగొట్టగా ఇనోక రణవీరా 2, శశికళ సిరివర్ధనే, అమ కంచన చెరో వికెట్ తీశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన టీమిండియా బ్యాట్స్ విమెన్ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.