: మోదీకి 'ఐ లవ్యూ' చెప్పిన మోషే.. నువ్వెప్పుడు రావాలనుకుంటే అప్పుడు భారత్ రావచ్చని ఆఫర్ ఇచ్చిన ప్రధాని!
26/11 ముంబయి పేలుళ్ల బాధిత ఇజ్రాయెల్ చిన్నారి మోషే హాల్జ్ బర్గ్ (11) ఎప్పుడైనా సరే భారత్ రావచ్చు, వెళ్లవచ్చని, జీవితంలో ఏ సమయంలోనైనా సరే భారత్ ను సందర్శించేందుకు వీలుగా జీవితకాల కుటుంబ వీసాను అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న మోదీ ముంబై పేలుళ్లలో తల్లిదండ్రులను కోల్పోయిన మోషేను కలిశారు.
చిన్నారిని చూడగానే చేతులు చాచి ఆలింగనం చేసుకున్న మోదీకి మోషే ‘డియర్ మోదీ.. ఐ లవ్యూ’ అని చెప్పాడు. ఈ సందర్భంగా మోషేను భారత్ రావాలని ప్రధాని సూచించారు. దీంతో వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ కల్పించుకుని ‘మోదీ నన్ను భారత్ కు ఆహ్వానించారు. నువ్వు రావాలనుకుంటే నాతో పాటు భారత్ రావచ్చు’ అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాగా, ముంబైలోని నారిమన్ హౌస్ లో తల్లిదండ్రులను కోల్పోయేనాటికి మోషే రెండేళ్ల చిన్నారి. నాటి పాక్ ముష్కరుల మారణకాండ నుంచి ఆ చిన్నారిని వాళ్లింట్లో పనిచేసే భారత్ కు చెందిన శాండ్రా శామ్యూల్ అనే ఆయా కాపాడింది!