: 26లోగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ‘చలో అమరావతి’ తప్పదు : ముద్రగడ హెచ్చరిక


మంజునాథ కమిషన్ ముమ్మాటికీ కాపుల కోసం వేసిన కమిషనేనని, బీసీల కోసం వేసిన కమిషన్ అయితే, పదమూడు జిల్లాల్లోని కాపులను ఎందుకు ఆహ్వానించారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాకు మంజునాథ వచ్చినప్పుడు తనను ప్రత్యేకంగా ఆహ్వానించారని, ఈ కమిషన్ బీసీల కోసం వేసిందని ఇప్పుడు మంజునాథ మాట మార్చడం వెనుక సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.

మంజునాథ వ్యాఖ్యలతో కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కాపులు ఎంతో ఆవేదన చెందుతున్నారని అన్నారు. కాపు రిజర్వేషన్లపై ఈ నెల 26 లోగా అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపాలని, లేకుంటే ‘చలో అమరావతి’ నిరవధిక పాదయాత్రతో తమ సత్తా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. తమ పాదయాత్రను కొనసాగనివ్వమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం అంటోందని, అయితే, చట్టాలు తమకు మాత్రమే వర్తిస్తాయా? వాళ్లకు మాత్రం చుట్టాలా? అని ముద్రగడ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News