: యువతిపై పలుమార్లు అత్యాచారం.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
బిస్కెట్ కింగ్ రాజన్ పిళ్లై సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త రాజమోహన్ పిళ్లై (53)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన ఓ యువతి (23)పై పలుమార్లు అత్యాచారం జరిపిన కేసులో ఆయనను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఉద్యోగం కోసం సదరు బాధితురాలు ఒడిశా నుంచి కేరళకు వచ్చింది. పిళ్లైకి చెందిన ఓ కంపెనీలో ఆమె గత ఎనిమిది నెలలుగా పని చేస్తోంది. ఈ క్రమంలో ఆమెపై పిళ్లై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో, ఆమె గర్భందాల్చింది. దీంతో, అబార్షన్ కోసం సదరు బాధితురాలు ఆసుపత్రికి వెళ్లింది.
అబార్షన్ చేయాలంటూ ఆమె వైద్యులను ప్రాధేయపడగా, డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఆసుపత్రికి వచ్చిన పోలీసులు ఆమెను విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పిళ్లై తనను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె తెలిపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను లోబరుచుకున్నాడని చెప్పింది. డాక్టర్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో సైతం ఆమెపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో పిళ్లైని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పిళ్లై మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.