: నా కొడుకుని ఇబ్బంది పెట్టడం ద్వారా నాపై కక్ష తీర్చుకుంటున్నారు!: కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ చిదంబరం
తనపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టిందని... తనను ఇబ్బందులకు గురి చేసేందుకు కంకణం కట్టుకుందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి అసలు టార్గెట్ తానేనని... దీని కోసం తన కుమారుడు కార్తీని వాడుకుంటున్నారని విమర్శించారు. ఇటీవల కాలంలో చిదంబరం కుటుంబంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు విచారణలు కూడా కొనసాగుతున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియా, వాసన్ హెల్త్ కేర్ లోకి విదేశీ పెట్టుబడుల కేసు కార్తీ మెడకు చుట్టుకుంది.
మరోపక్క, శారదా చిట్ ఫండ్ కేసులో చిదంబరం సతీమణి నళినిపై విచారణ కొనసాగుతోంది. కార్తీపై ఇప్పటికే సీబీఐ, ఈడీల దాడులు జరిగాయి. ప్రస్తుతం కార్తీ విదేశాల్లో ఉన్నారు. ఆయన ఇండియాకు తిరిగి రాగానే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చిదంబరం మాట్లాడుతూ, కేంద్రానికి టార్గెట్ తానేనని... రాజకీయంగా తనను అణగదొక్కడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. సీబీఐను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని... దీన్నంతా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.