: పళనిస్వామి నిర్ణయంపై గళం విప్పి నిరసన తెలిపిన రజనీకాంత్!


తమిళనాడు చిత్ర పరిశ్రమపై రెండు పన్నులు వేయాలని పళనిస్వామి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, 28 శాతం వస్తు సేవల పన్నుకు అదనంగా 30 శాతం వినోదపు పన్ను భారం మోయలేనిదని, పరిశ్రమపై ఆధారపడ్డ లక్షలాది మందికి ఉపాధి కరవవుతుందని, వెంటనే పన్ను భారం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికుల మేలు కోసం కృషి చేయాలని సూచించారు.

కాగా, జీఎస్టీతో పాటు వినోదపు పన్ను కలిపితే, 100 రూపాయల టికెట్ ఉన్న థియేటర్ నుంచి 50 రూపాయలకు పైగానే ప్రభుత్వానికి వెళుతుంది. ఇక కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నిర్మించిన వారికి కలెక్షన్ల వర్షం కురిసినా, అందులో మిగిలేది స్వల్పమే అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు శరాఘాతంగా మారిన వినోదపు పన్ను నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని రాష్ట్రంలోని థియేటర్లన్నీ నిన్నటి నుంచి మూతబడిన సంగతి తెలిసిందే. నేడు కూడా ఒక్క థియేటర్ కూడా తెరచుకోలేదు.

కమలహాసన్, విశాల్, కార్తీ వంటి పలువురు తమిళ హీరోలు ఇప్పటికే ప్రభుత్వం దిగిరావాలని విన్నవించారు. చిన్న థియేటర్లపై 48 శాతం పన్ను భారం ఉండగా, ఈ స్థాయిలో పన్నులు చెల్లించి తాము థియేటర్లను నడపలేమని యజమానులు తేల్చి చెబుతున్నారు. మరోవైపు విడుదలకు సిద్ధమైన కొత్త సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నిలిచిపోయాయి. వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే, జల్లికట్టు తరహా ఆందోళనకు దిగుతామని సినీ సంఘాలు ఇప్పుడు హెచ్చరిస్తున్నాయి.

  • Loading...

More Telugu News