: ప్రత్యర్థులతో రె'ఢీ'... ముఖేష్ అంబానీ మరో సంచలనం... రూ. 500కే 4జీ ఫోన్!
4జీ సేవలను ప్రారంభించి, ఉచిత వాయిస్, డేటా సేవలంటూ, ప్రత్యర్థి టెలికం కంపెనీలకు కునుకు లేకుండా చేసిన రిలయన్స్ జియో, తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. 4జీ తరంగాల సాయంతో పనిచేసే ఫీచర్ ఫోన్ ను రూ. 500కే ఇవ్వాలని నిర్ణయించింది. గతంలోనే ఈ ఫోన్ పై కొంత సమాచారం బయటకు పొక్కగా, దీని ధర రూ. 1500 వరకూ ఉంటుందని భావించారు. అయితే, దిగువ తరగతి మార్కెట్ పై కన్నేసిన ముఖేష్ అంబానీ, రూ. 500కే అందించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బ్రోకరేజ్, ఆర్థిక సేవల సంస్థ హెచ్ఎస్బీసీ తెలిపింది.
ఈ నెల 21వ తేదీన జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చినట్టు తెలిపింది. ఇదే సమయంలో ఈ నెలతో ముగియనున్న ధనా ధనా ధన్ ఆఫర్ స్థానంలో మరో ఆకర్షణీయ టారిఫ్ ప్లాన్ ఆయన నోటి వెంట రానుందని పేర్కొంది. కాగా, ప్రస్తుతం 2జీ ఫోన్లను వాడుతున్న మార్కెట్ ను 4జీ వైపు కదిలించడమే తన లక్ష్యంగా ముఖేష్ వేస్తున్న అడుగులు, ఎయిర్ టెల్ తో పాటు ఐడియా తదితర సంస్థల రూరల్ మార్కెట్ పై పెను ప్రభావాన్ని చూపవచ్చని హెచ్ఎస్బీసీ డైరెక్టర్ రాజీవ్ శర్మ అంచనా వేశారు.