: 'బీరు హెల్త్ డ్రింక్' అన్న జవహర్ కు చంద్రబాబు క్లాస్
'బీరు హెల్త్ డ్రింక్' అని వ్యాఖ్యానించి, మహిళల ఆగ్రహానికి కారణమైన ఏపీ ఎక్సైజ్ మంత్రి జవహర్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు ఆయనను పిలిపించి క్లాస్ పీకారు. భావ వ్యక్తీకరణ విషయంలో మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మీడియాతో మాట్లాడుతుంటే మాటలు తూలకూడదని హెచ్చరించారు. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని చురకలంటించారు.
మద్యం దుకాణాల విషయంలో మహిళల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పిన ఆయన, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న ప్రాంతాల్లో అందుకు తగ్గ మార్పులు చేయాలని జవహర్ కు సూచించారు. మరోసారి ఇటువంటి పొరపాటు జరుగకుండా చూసుకోవాలని సూచించారు. కాగా, తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలూ చేయలేదని జవహర్ వివరణ ఇవ్వబోగా, ఏం జరిగిందో తనకు తెలుసునని ముఖ్యమంత్రి కాస్త గట్టిగానే అన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం మద్యం వెంట పడటం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా కృషి చేయాలని, లేకుంటే నష్టపోతామని జవహర్ కు చంద్రబాబు తేల్చి చెప్పినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.