: ‘భారత్ ను ఎలాగైనా అడ్డుకోవాలి’... ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై పాక్ పత్రికల గగ్గోలు!
ఇజ్రాయెల్‌లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధానమంత్రి ఘనస్వాగతం పలికిన విషయం తెలిసిందే. మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై పాకిస్థాన్ మీడియా ప్రత్యేక దృష్టి పెట్టింది. పాకిస్థాన్ విశ్లేషకులు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తమ సైన్యాన్ని ఎదుర్కొనేందుకే భారత్ ప్రణాళికలు వేసుకుంటోందని పేర్కొంటున్నారు. దౌత్యపరంగా భారత్ చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకోకపోతే తమ దేశానికి కష్టాలు తప్పవని వాపోతున్నారు. పాకిస్థాన్ లోని ఆంగ్ల, ఉర్దూ పత్రికలు మోదీ పర్యటన గురించే ప్రధానంగా కథనాలు ప్రచురించాయి.
ఇజ్రాయెల్‌లో భారత ప్రధాని మొట్టమొదటి సారిగా పర్యటిస్తున్నారని హెడ్డింగులు పెట్టి మరీ ప్రచురించాయి. పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్, భారత్ ఏకమవుతున్నాయని పేర్కొన్నాయి. ఓ పక్క హిందూ జాతీయవాదం, మరో పక్క యూదుల జాతీయవాదం మధ్య దగ్గర పోలికలు ఉంటాయని సెక్యూరిటీ నిపుణుడు బ్రిగ్ ఘజాన్ఫర్ అలీ వ్యాఖ్యానించారు.
ఆయా దేశాలు తమ తమ జాతీయ ప్రయోజనాలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో తమ దేశ భద్రతపై అధికంగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌తో సౌదీ అరేబియా కూడా సత్సంబంధాలు నెలకొల్పుకుంటోందని, అదే కనుక జరిగితే తమ దేశం ఇబ్బందుల్లో పడుతుందని పేర్కొన్నారు. భారత్ రక్షణాత్మకంగా తీసుకుంటున్న ఈ చర్యలను ఎలాగైనా అడ్డుకోవాల్సి ఉందని చెప్పారు.