: కమలహాసన్ ని ఒక్కరోజు ముఖ్యమంత్రిని చేయాలి: ‘ప్రేమమ్’ దర్శకుడు
సుమారు పద్దెనిమిది ఏళ్ల క్రితం ఎన్.శంకర్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘ముదల్వన్’ చిత్రం తెలుగులో ‘ఒకే ఒక్కడు’. ఈ చిత్రంలో హీరోగా నటించిన అర్జున్ ఆ సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి అవుతాడు. కట్ చేస్తే.. తమిళనాడు రాష్ట్రానికి విలక్షణ నటుడు కమలహాసన్ ని ఒక్కరోజు ముఖ్యమంత్రిగా చేస్తే బాగుంటుందని ‘ప్రేమమ్’ ఫేం, మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ సోషల్ మీడియా ద్వారా అభిప్రాయపడ్డారు.
తమిళంలో వచ్చిన 'ముదల్వన్' సినిమాలోలా ఒక్కరోజు సీఎంను నియమించే అవకాశం ఉంటే, తమిళనాడు ప్రజలను చూసుకునేందుకు కమలహాసన్ ను ఒక్కరోజు సీఎంను చేయాలని అన్నారు. త్వరలోనే ఈ విధంగా జరుగుతుందని భావిస్తున్నానని, కేవలం ఒక్కరోజులోనే కమల్ తన వినూత్నమైన ఆలోచనలతో ప్రభుత్వాన్ని మెరుగైన స్థాయికి తీసుకెళ్తారనేది తన అభిప్రాయమని చెప్పిన ఆల్ఫోన్స్ పుత్రేన్, ఏదైనా తప్పుమాట్లాడి ఉంటే కనుక, ఈ పిల్లాడిని క్షమించాలని కోరడం గమనార్హం.