: ఎస్.. నేను భారత క్రికెటర్ కు వీరాభిమానిని: పాక్ మహిళా క్రికెటర్ కైనత్
భారత్, పాకిస్థాన్ ల మధ్య పచ్చ గడ్డి వస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ లను క్రికెట్ అభిమానులు ఓ యుద్ధంగానే భావిస్తారు. భారత ఆటగాళ్లలో తమ అభిమాన క్రికెటర్ ఉన్నప్పటికీ... ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి పాక్ క్రికెటర్లు భయపడతారు.
అయితే పాక్ మహిళా క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ మాత్రం తన అభిమాన క్రికెటర్ ఝులన్ గోస్వామి (భారత్) అని బాహాటంగా ప్రకటించింది. అంతేకాదు గోస్వామిని కలుసుకున్నానంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. మహిళల ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో పాక్ పై భారత మహిళా జట్టు 95 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే గోస్వామిని కలిశానని... తన ఆరాధ్య క్రికెటర్ ను కలవాలన్న తన కల నిజమైందని ఆమె చెప్పింది. గోస్వామిని చూసే, తాను ఫాస్ట్ బౌలర్ గా కెరియర్ ను ఎంచుకున్నానని చెప్పింది. ఈ సందర్భంగా గోస్వామితో కలసి దిగి ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.