: 'పొగడరా నీ తల్లి భూమి భారతిని' అనే రాయప్రోలు పాటను మార్చేసిన రామ్ గోపాల్ వర్మ
ఎన్టీఆర్ జీవిత చరిత్రతో సినిమాను తీస్తున్నట్టు సంచలన దర్శకుడు వర్మ ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ఒక ఆడియో విడుదల చేశాడు. ఆడియోలో ఆయన మాట్లాడుతూ, తనకు ఎన్టీఆర్ తో ఉన్న వ్యక్తిగత అనుబంధం ఏమిటంటే... ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'అడవిరాముడు'ను తాను 23 సార్లు చూశానని తెలిపాడు. ఆయన సినిమా చూసేందుకు బస్సు టికెట్ కు డబ్బుల్లేక, 10 కిలోమీటర్లు నడిచి థియేటర్ కు వెళ్లానని చెప్పాడు. ఎన్టీఆర్ నిర్వహించిన టీడీపీ తొలి మహానాడుకు లక్షలాది మంది తరలి రాగా అందులో తాను కూడా ఉన్నానని వర్మ తెలిపాడు. అంతటి సామాన్యుడినైన తాను... ఇప్పుడు ఆ మహానుభావుడి బయోపిక్ ను తెరకెక్కించడం పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు.
'ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అని రాయప్రోలుగారు అంటే... ఓ సినిమా దర్శకుడిగా కాకుండా ఎనిమిది కోట్ల తెలుగు ప్రజల్లో ఒకడిగా ప్రపంచంలో నలు మూలలా ఉన్న తెలుగువారందరికీ 'ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్ ను' అని పాడమని చెబుతానని తెలిపాడు.