: మంత్రి నారాయణపై తక్షణం చర్యలు తీసుకోవాలి!: 'తిరుపతి నారాయణ కాలేజీ' ఎదుట మృతురాలి బంధువుల ఆందోళన
ఏపీ మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని తిరుపతిలోని నారాయణ కాలేజీ ఎదుట బాధితులు ఆందోళన చేశారు. తిరుపతి నారాయణ కళాశాలలో గత రాత్రి భోజనం సమయంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై కాలేజీ యాజమాన్యం ఇచ్చిన వివరణపై మృతురాలి తండ్రి తీవ్రంగా స్పందించారు. తన కుమార్తె 5వ తరగతి నుంచి పదవతరగతి వరకు హాస్టల్ లోనే వుండి చదువుకుందని, అలాంటప్పుడు ఆమెకు మానసికస్థైర్యం లేదని కాలేజీ యాజమాన్యం ఎలా చెబుతారని ప్రశ్నించారు.
తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే తమ కుమార్తెకు లవ్ అఫైర్ ఉందంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె గతంలో చదివిన ఏ స్కూల్ లోనైనా తన కుమార్తె గురించి అడిగితే టీచర్లు ఏం చెబుతారో తెలుసుకోవాలని ఆయన అన్నారు. నారాయణ కళాశాలలో లక్షల రూపాయలు ఫీజులు గుంజడం తప్పించి, క్రమశిక్షణ, శ్రద్ధ, సౌకర్యాలు లేవని ఆయన అన్నారు. కేవలం టీచర్ల తీరువల్లే విద్యార్థినులు ఆందోళనలోకి వెళ్లిపోతున్నారని, అందుకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. మంత్రి నారాయణపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.