: జయలలిత మృతిలో రహస్యం లేదు...జైల్లో శశికళ రాస్తున్న ఆత్మకథలో అన్నీ తెలుస్తాయి: శశికళ భర్త ప్రకటన
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిలో ఎలాంటి రహస్యం లేదని శశికళ భర్త, రచయిత నటరాజన్ తెలిపారు. ఒక టీవీ ఛానెల్ కు సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయలలిత మృతిపై జైల్లో శశికళ రాస్తున్న ఆత్మకథలో అన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని ఎన్నికల కమిషన్ ఆదేశించ లేదని, ఒకవేళ ఆదేశించినా శశికళ మళ్లీ ఆ పదవికి పోటీ చేస్తారని ఆయన తెలిపారు.
జయలలిత మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని ఆయన చెప్పారు. ఆమె మరికొన్నాళ్లు జీవించి ఉంటే బాగుండేదని ఆయన చెప్పారు. అయితే రోజూ ప్రభుత్వం కోసం 20 గంటలు కష్టపడడం ఆరోగ్యానికి హానిగా మారిందని ఆయన చెప్పారు. ఆమెకు అయిదుగురు కార్యదర్శులు ఉండేవారని, ఆమెకు దూరంగా శశికళతో పాటు తాము కూడా దూరంగానే ఉన్నామని, ఆమెకు ఏమైందో కూడా తమకు తెలియదని ఆయన చెప్పారు.
కనీసం మంత్రులైనా ఆమె ఆరోగ్యపరిస్థితిపై హెచ్చరించలేదని ఆయన మండిపడ్డారు. అన్నాదురై జయంత్యుత్సవాల్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించడానికి కూడా ఆమెకు సాధ్యపడక తడబాటుకు గురయ్యారని ఆయన చెప్పారు. అప్పట్లో ఒకసారి ఆమె సచివాలయంలో మెట్లు ఎక్కబోతూ అదుపు తప్పినప్పుడు సమీపంలోని భద్రతాధికారి చేయూతనందించారని ఆయన తెలిపారు. ఇవన్నీ ఆమె ఆరోగ్య పరిస్థితిని సూచిస్తున్నాయని, జయలలిత ఆరోగ్య పరిస్థితిపై శశికళ శ్రద్ధ చూపించారా? లేదా? అన్న అంశాలపై జయలలితను ప్రశ్నిస్తే తెలిసేదని, దీనిని తెలిపేందుకు గతంలో శశికళపై పలు ఇంటర్వ్యూల్లో జయలలిత చేసిన వ్యాఖ్యల సీడీలు ఇస్తానని, వాటిని పరిశీలించాలని ఆయన సూచించారు.
జయలలిత మృతిలో ఎలాంటి రహస్యము లేదని ఆయన స్పష్టం చేశారు. ఆమె ఆసుపత్రిలో చేరడానికి ముందు జయలలిత వెంట ఆమె వ్యక్తిగత భద్రతాధికారి ఉన్నారని, ఆయనను అడిగినా నిజాలు చెబుతారని ఆయన తెలిపారు. వారంతా ఎందుకు నోరిప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. అపోలో వైద్యులతోపాటు, విదేశీ నిపుణులు, ఎయిమ్స్ వైద్యులు కూడా వాస్తవాలు వెల్లడించారని ఆయన చెప్పారు. ఓపీఎస్ వ్యాఖ్యలను ఎవరూ స్వీకరించలేదని ఆయన స్పష్టం చేశారు.