: కొంప ముంచిన కాక్టెయిల్.. తాగిన వ్యాపారవేత్త కడుపులో పెద్ద రంధ్రం.. వైద్యులు షాక్!
ఓ పబ్బులో కొత్తగా ప్రవేశ పెట్టిన లిక్విడ్ నైట్రోజన్ కాక్టెయిల్ ఓ వ్యాపారవేత్త కొంప ముంచింది. దానిని తీసుకున్న అతడి కడుపులో పెద్ద రంధ్రమైంది. పొట్టలోని పేగులు ఛిద్రమైపోయాయి. గురుగ్రామ్‌కు చెందిన వ్యాపారవేత్త సుమీత్ ప్రసాద్ (అసలు పేరు కాదు) స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు ఓ పబ్‌కు వెళ్లాడు. అక్కడ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన లిక్విడ్ నైట్రోజన్ కాక్టెయిల్ను ఆర్డర్ చేశారు. దానిని వెంటనే తీసుకోవాలి. లేదంటే గడ్డకట్టుకు పోతుంది.
దీంతో సుమీత్ ప్రసాద్ దానిని తీసుకున్నాడు. ఆ వెంటనే బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి శరీరంలో పెద్ద మొత్తంలో లాక్టిక్ ఆమ్లాలు విడుదలైనట్టు రక్త పరీక్షలో గుర్తించారు. ఇవి శరీరంలో ఆక్సిజన్ సరఫరాను తగ్గించి వేస్తాయి. అంతేకాదు అతడి సీటీ స్కాన్‌ను చూసిన వైద్యులు నోరెళ్లబెట్టారు. ఆయన పొట్టలోని నరాలు మొత్తం ఛిద్రమై పోయి తెరిచిన పుస్తకంలా మారడంతో వైద్యులు షాకయ్యారు. బతికే అవకాశాలు చాలా తక్కువగానే ఉండడంతో వెంటనే శస్త్రచికిత్స చేసి రంధ్రాన్ని సరిచేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ 13న ఈ ఘటన జరగ్గా సుమీత్ ఇప్పటికి కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. సర్జరీ చేసిన తర్వాత మూడు రోజులు అతడిని వెంటిలేటర్‌పై ఉంచినట్టు తెలిపారు. లిక్విడ్ నైట్రోజన్ కాక్టెయిల్ చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. అంటార్కిటికాలోని అత్యంత చల్లనైన వాతావరణం కంటే కూడా ఈ లిక్విడ్ నైట్రోజన్ కాక్టెయిల్ చల్లగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిని తీసుకున్న వెంటనే అది గ్యాస్‌గా మారిపోతుందని, ఒక్కోసారి పొట్ట పేలిపోయే ప్రమాదం ఉందని వివరించారు. కాబట్టి లిక్విడ్ నైట్రోజన్ కలిగిన డ్రింక్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు.