: 'వయసులో చిన్నోడివని చెప్పినా వినలేదు... ఇప్పుడిలా మోసం చేస్తున్నాడు'... మౌన పోరాటానికి దిగిన యువతి
తనకన్నా చిన్నవాడైన యువకుడిని ప్రేమించి మోసపోయిన ఓ యువతి ఇప్పుడు మౌన పోరాటానికి దిగింది. మహబూబాబాద్ శివారులోని ఓ కాలనీలో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, పీజీ పూర్తి చేసిన బోడ సురేష్ అనే యువకుడు, అదే ప్రాంతంలోని స్వాతి అనే బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్న యువతితో ప్రేమలో పడ్డాడు. వయసులో నా కన్నా చిన్నవాడివి, నీకు నాతో ప్రేమేంటని స్వాతి ఎంత వారించినా వినలేదు. చివరికి ఆమె ప్రేమను గెలుచుకున్నాడు. ఆపై వారిద్దరి బంధం మరిన్ని అడుగులు వేసింది.
ఈ క్రమంలో ఆమె గర్భం ధరించడంతో, రహస్యంగా తీసుకెళ్లి అబార్షన్ కూడా చేయించాడు. రెండేళ్ల ప్రేమాయణం తరువాత, పెళ్లి చేసుకోవాలని స్వాతి ఒత్తిడి చేస్తుంటే, తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. తనకు గర్భస్రావం చేయించినప్పటి నుంచి సురేష్ మారిపోయాడని, మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్నాడని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, అతని ఇంటి ముందు స్వాతి మౌన పోరాటానికి దిగింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు తెలుపగా, సురేష్ కుటుంబీకులు మాత్రం ఇల్లు తాళం పెట్టి వెళ్లిపోయారు. ఈ కేసులో పోలీసులకు ఫిర్యాదు అందిందా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.