: 'సదావర్తి'పై ఏపీ సర్కారుకు షాక్... 5 కోట్లు అదనంగా ఇచ్చి 84 ఎకరాలను తీసుకోవచ్చని ఆళ్ల రామకృష్ణారెడ్డికి అనుకూలంగా తీర్పు
అత్యంత విలువైన సదావర్తి సత్రం భూముల విషయంలో ఏపీ ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. మొత్తం 84 ఎకరాల భూమిని రూ. 22 కోట్లకు విక్రయించడాన్ని సవాల్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించగా, నేడు తుది తీర్పు వెలువడింది. తమ వేలం పారదర్శకంగా సాగిందని చెప్పిన ఏపీ ప్రభుత్వం, రూ. 22 కోట్ల కన్నా అదనంగా మరో రూ. 5 కోట్లు ఇస్తే, ఆ భూములను మీకే ఇస్తామని ఎమ్మెల్యేకు ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇదే విషయాన్ని విచారణలో ఆళ్ల హైకోర్టుకు తెలిపారు. తాను రూ. 5 కోట్లను అదనంగా ఇచ్చేందుకు సిద్ధమని చెప్పగా, కోర్టు అంగీకరించింది. రెండు వారాల్లోగా ఏపీ ప్రభుత్వానికి రూ. 10 కోట్లు చెల్లించాలని తీర్పిచ్చింది. ఈ తీర్పును స్వాగతించిన ఎమ్మెల్యే, కోర్టు ఆదేశాలను శిరసావహిస్తానని చెప్పారు.