: విమానంలో ఏసీ పనిచేయకపోతే ఎలా ఉంటుందో తెలుసా?...ఎయిరిండియా ప్రయాణికుల పాట్ల వీడియో చూడండి!
విమానంలో ఏసీ పనిచేయకపోతే ఎలా ఉంటుందో తెలుసా? అయితే మీరు ఎయిరిండియా విమానం ఎక్కాల్సిందే.... ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లోని బగ్ డోరా నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఏసీ పని చేసేందుకు మొరాయించింది. దీంతో విమానానికి ఏసీ సరఫరా నిలిచిపోయింది. బయల్దేరిన 20 నిమిషాలకే ఏసీ పని చేయడం లేదంటూ ప్రయాణికులు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయితే కాసేపట్లో ఏసీ పనిచేస్తుందని సిబ్బంది సమాధానమిచ్చినా ఏసీ మాత్రం పని చేయలేదు.
దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 168 మంది ప్రయాణికులు అసహనంతో ఊగిపోయారు. చల్లగాలి లేక ఊపిరి ఆడకపోవడంతో కొందరు ఆక్సిజన్ మాస్కులు తగిలించుకుని ప్రయాణించే ప్రయత్నం చేశారు. అయితే అవి కూడా పని చేయడం లేదని పలువురు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఇక ఆగలేకపోయిన ప్రయాణికులు విమానంలోని బ్రోచర్, మేగజీన్ ను విసనకర్రగా చేసుకుని గాలి విసురుకున్నారు. దీనిని ట్విట్టర్ మాధ్యమంగా ఎయిరిండియా దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో విమానంలో ఏసీ పనిచేయకపోతే ఎలా ఉంటుందో చూడాలంటూ వీడియోలు పోస్టు చేశారు.