: కెల్విన్ ను లాగుతుంటే కదులుతున్న టాలీవుడ్ డ్రగ్స్ డొంక... రాకెట్ లో 21 మంది విఐపీలు
ఉన్నత కుటుంబానికి చెందిన ఓ తొమ్మిదో తరగతి బాలిక తనకు డ్రగ్స్ కావాలని పెట్టిన మెసేజ్ పట్టుకుని, మూడు వారాలుగా నిఘా పెట్టి, పోలీసులు అరెస్ట్ చేసిన మేనేజ్ మెంట్ విద్యార్థి కెల్విన్ ను విచారిస్తుంటే, టాలీవుడ్ లో పాతుకుపోయిన డ్రగ్స్ డొంక కదులుతోంది. ఈ రాకెట్ పై పూర్తి స్థాయి విచారణకు దిగిన హైదరాబాద్ పోలీసులు, 21 మంది వీఐపీలను విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసు చాలా పెద్దదని, ఎంతో మంది విద్యార్థులు ఇందులో చిక్కుకున్నారని, ఎన్నో ప్రముఖ పాఠశాలల్లో డ్రగ్స్ దందా సాగినట్టు తెలుస్తోందని, వారిని విచారించాలా? వద్దా? అన్న విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నామని తెలంగాణ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు.
ఓ నిర్మాతను విచారించనున్నామని, 9 కాలేజీలు, 4 ఇంటర్నేషనల్ స్కూళ్లకు నోటీసులు పంపామని తెలిపారు. కెల్విన్ తో పాటు తాము అరెస్ట్ చేసిన మిగతా ఇద్దరి సెల్ ఫోన్లలో ఎంతో మంది ప్రముఖులు డ్రగ్స్ కోసం పెట్టిన రిక్వెస్టులు ఉన్నాయని, వారందరినీ విచారించాల్సి వుందని అన్నారు. ఇప్పటివరకూ 9 మందిని విచారించామని అన్నారు. కాగా, కెల్విన్ తండ్రి బెర్నార్డ్ మాత్రం, తన కుమారుడిని డ్రగ్స్ బానిసగా మాత్రమే చూడాలని, అతనికి వ్యాపారంతో సంబంధం లేదని చెబుతుండటం గమనార్హం. అతన్ని బాధితుడిగా మాత్రమే పరిగణించాలని కోరాడు.