: భోజనం కోసం రచ్చ రచ్చ చేసిన వైకాపా కార్యకర్తలు!
నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగిన వేళ, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పోటాపోటీగా కార్యకర్తల సమీకరణ చేయగా, వారు రెండు గ్రూపులుగా విడిపోయి భోజనం కోసం గొడవ పడి రచ్చ రచ్చ చేశారు. మధ్యాహ్నం 2 గంటలైనా భోజన విరామం ఇవ్వకుండా నేతల ప్రసంగాలు సాగుతుండటంతో, కార్యకర్తల్లో అసహనం పెరిగి గందరగోళం నెలకొంది. చివరకు భోజనాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే, గది తలుపుల అద్దాలు ధ్వంసం చేసి, సెక్యూరిటీ చెయ్యి విరిచి మరీ పరుగులు తీశారు.
వీఐపీలకు, కార్యకర్తలకు విడివిడిగా భోజన ఏర్పాట్లు చేసినా, మొత్తం కలగాపులగమైపోయింది. క్రమశిక్షణా రాహిత్యం స్పష్టంగా కనిపించింది. ఇక ప్లీనరీలో మాట్లాడిన నేతలు మాత్రం కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా మాట్లాడారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, తదుపరి సీఎం జగనేనని, చంద్రబాబు మోసాలను ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. 15 మంది వరకూ ప్రసంగించి, 30కి పైగా తీర్మానాలను చర్చించి పార్టీ అధిష్ఠానానికి పంపారు.