: అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమవుతున్న కేసీఆర్ సర్కార్.. అవసరమైతే కొత్త చట్టం!


మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న భూతాలలో కల్తీ భూతం అతి పెద్దది. చిన్నపిల్లలు తాగే పాల దగ్గర నుంచి ప్రతి రోజూ మనం కొంటున్న ప్రతి వస్తువూ కల్తీమయమే. నూనె, నెయ్యి, విత్తనాలు, పురుగు మందులు, నిత్యావసరవస్తువులతో పాటు చివరకు మనం వేసుకుంటున్న మందుల వరకు కల్తీనే. కాదేదీ కల్తీకి అనర్హం అనే రీతిలో ఈ కల్తీ భూతం పంజా విసురుతోంది. జడలు విచ్చుకున్న ఈ కల్తీ దందాను సమూలంగా అంతమొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమయింది. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కల్తీ దందాను అంతమొందించేందుకు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు.

కల్తీ నివారణకు అవసరమైన అన్ని కఠిన చర్యలను తీసుకునే నేపథ్యంలో, నిన్న పోలీసు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కల్తీగాళ్లను పట్టుకునే పోలీసులకు ఇన్సెంటివ్ లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం నిర్ణయించారు. పోలీస్ శాఖ ఈ విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. డీజీపీ దగ్గర నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరు ఈ కల్తీని అంతమొందించేందుకు త్రికరణశుద్ధితో పని చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

కల్తీలకు పాల్పడుతున్న వ్యక్తులపై చీటింగ్, కాపీరైట్ చట్టాల కింద కేసులు నమోదు చేయాలని... వారిపై పీడీ యాక్టును ప్రయోగించే వెసులుబాటును కూడా కల్పిస్తున్నామని... అవసరమైతే మరిన్ని కఠిన చట్టాలను కూడా తీసుకొస్తామని కేసీఆర్ చెప్పారు. నూటికి నూరు శాతం కల్తీని అంతమొందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News