: నాపై కోపముంటే తీర్చుకోండి.. కుట్రలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచివేస్తా: చంద్రబాబు వార్నింగ్
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు విపక్ష నేతలు ఎన్నో కుట్రలకు పాల్పడుతున్నారని... రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలు కొత్తవి కావని, 2016 అక్టోబర్ 8వ తేదీ నుంచే కుట్రలకు తెరతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కోపం ఉంటే తీర్చుకోవాలని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కుట్రదారులను ఉక్కుపాదంతో అణచివేస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
వీరంతా కడివెడు పాలలో ఒక విషపు చుక్కగా మారారని... ఇలాంటి విష పోకడలను ప్రజలు హర్షించరని చెప్పారు. 1997-98లో తాను విద్యుత్తు సంస్కరణలను తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాగే అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. అయినా విజయవంతంగా విద్యుత్ సంస్కరణలను అమలు చేశానని చెప్పారు. ఇలాంటి సవాళ్లు తన చరిత్రలో కొత్తేం కాదని... న్యాయపరంగా అన్ని కుట్రలను అధిగమిస్తానని అన్నారు.
ఐదు కోట్ల ఆంధ్రులు గర్వపడేలా రాజధానిని నిర్మించడం భగవంతుడు తనకు ఇచ్చిన బాధ్యత అని... దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారు. రాజధాని పనులను వేగవంతం చేస్తానని తెలిపారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రపంచబ్యాంక్ నుంచి సాధించితీరుతానని చెప్పారు. ప్రభుత్వ చిత్తశుద్ధిపై రాజధాని ప్రాంత రైతులకు ఎంతో నమ్మకం ఉందని... ఈ విషయాన్ని కుట్రదారులు గుర్తించాలని అన్నారు. మరోవైపు, పోలవరం పనులను కూడా అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.