: విద్య కోసం పిల్లలపై 12 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్న తల్లిదండ్రులు
మన దేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకూ ఒక్కో విద్యార్థి చదువు కోసం తల్లిదండ్రులు సగటున 12.22 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ‘ద వ్యాల్యూ ఎడ్యుకేషన్’ సిరీస్ ‘హయ్యర్ అండ్ హయ్యర్’ పేరిట హెచ్ఎస్బీసీకి చెందిన ప్రతినిధులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విద్యకు మరింత ఎక్కువ ఖర్చవుతోందని ఈ అధ్యయనం తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో విద్యార్థికి సగటున విద్య కోసం 28.58 లక్షల రూపాయలు ఖర్చవుతోందని వారు వెల్లడించారు. స్కూలు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, రవాణా, వసతి అన్నీ కలిపి కేజీ నుంచి పీజీ వరకు తల్లిదండ్రులు ఇంత మొత్తం ఖర్చు చేస్తున్నారని వారు తెలిపారు. హాంగ్ కాంగ్ లో అత్యధికంగా 85.42 లక్షల రూపాయలు ఖర్చవుతోందని, అత్యల్పంగా ఫ్రాన్స్ లో 10.8 లక్షల రూపాయలు ఖర్చువుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో నిలిచిందని వారు చెప్పారు.