: కూకట్ పల్లిలో ఘోరం... బోనాలు సమర్పించేందుకు స్కూటర్ పై వెళుతూ, కుటుంబమంతా మృతి


హైదరాబాద్ బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పిద్దామని వెళుతున్న ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. కూకట్ పల్లిలో వేగంగా దూసుకు వచ్చిన ఓ సిమెంట్ లారీ మృత్యు శకటంగా మారి కుటుంబం మొత్తాన్నీ చిదిమేసింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, బీహెచ్ఈఎల్ కు చెందిన నర్సింహులు, అతని భార్య లలిత, కూతురు శిరీషలు తమ స్కూటీపై బల్కంపేట అమ్మవారి దగ్గరకు పూజా సామాగ్రిని తీసుకుని బయలుదేరారు. మరో పదిహేను నిమిషాలు ప్రయాణిస్తే, వారు ఆలయానికి చేరుకునేవారు.

కానీ, వారి వాహనం కూకట్ పల్లి వివేకానందనగర్ సమీపంలోకి రాగానే, వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ (ఏపీ 09 డబ్ల్యూ 7438) ఢీకొంది. అంతటితో ఆగకుండా ముగ్గురిపై నుంచీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పారిపోయాడని, కేసు నమోదు చేశామని తెలిపారు. సమయం దాటిన తరువాత సిటీలోకి భారీ వాహనాలను అనుమతించిన పోలీసుల అవినీతే ఈ ప్రమాదానికి కారణమైందని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News