: లాలుకు మళ్లీ షాకిచ్చిన నితీశ్.. దేశ్ బచావో ర్యాలీకి డుమ్మా.. ఆర్జేడీ, జేడీయూ బంధానికి బీటలు!


ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌కు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మధ్య దూరం పెరుగుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇద్దరి మధ్య నెలకొన్న అగాధం పెరుగుతూ పోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా బయటపడిన మనస్పర్థలు తాజాగా మరోమారు బహిర్గతమయ్యాయి.

రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ నిలబెట్టిన రామ్‌నాథ్ కోవింద్‌కు బహిరంగంగానే మద్దతు ప్రకటించిన నితీశ్ కుమార్ ఆర్జేడీకి ఝలక్కిచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఇచ్చిన విందుకు హాజరుకాకుండా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన విందుకు హాజరై రెండో సారి షాకిచ్చారు. ముచ్చటగా మూడోసారి జీఎస్టీ అమలు సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన పార్లమెంట్ సెషన్‌కు తన ప్రతినిధులను పంపి తన ఉద్దేశాన్ని చాటిచెప్పారు. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ, కాంగ్రెస్ హాజరు కాలేదు.

తాజాగా మరోమారు ఆర్జేడీపై ఉన్న వ్యతిరేకతను నితీశ్ కుమార్ బయటపెట్టారు. ఆగస్టు 27న పాట్నాలో ఆర్జేడీ నిర్వహించనున్న ‘బీజేపీ హఠావో.. దేశ్ బచావో’ ర్యాలీకి డుమ్మా కొట్టాలని నితీశ్ నిర్ణయించారు. ఆర్జేడీ ర్యాలీలో జేడీయూ పాల్గొనబోదని ఆ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ శ్యామ్ రజక్ తెలిపారు.  జేడీయూ తాజా ప్రకటన ఇరు పార్టీల మధ్య నెలకొన్న మనస్పర్థలకు ప్రత్యక్ష ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News