: నేనేదో పెద్ద తప్పుచేసినట్లు.. మోసం చేసినట్లు బూతులు తిట్టారు: సంపూర్ణేష్ బాబు
తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘హృదయకాలేయం’ సినిమాలో హీరోగా నటించినప్పుడు తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని నటుడు సంపూర్ణేష్ బాబు అన్నాడు. ఆ సినిమాలో సంపూర్ణేష్ బాబు తెలుగు సినిమాల్లో ఉండే ఓవర్ యాక్షన్‌ను కళ్లకు కట్టినట్లు చూపించి, కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలైన తరువాత తనకు ఎవరెవరో ఫోన్లు చేసి, తానేదో పెద్ద తప్పుచేసినట్లు, మోసం చేసినట్లు బండ బూతులు తిట్టారని అన్నారు. ఆ సినిమా ఏంటీ? నువ్వు హీరో ఏంటీ? అని ఎన్నో మాటలు అనేవారని అన్నాడు. దీంతో తనకు ఫోన్ వస్తే ఎత్తాలంటే భయం వేసేదని చెప్పాడు. జీవితంలో ఎవ్వరికీ అలాంటి బాధ రాకూడదని అనుకున్నానని తెలిపాడు.
తనకు డ్యాన్స్ బాగా చేయాలనిపిస్తుందని కానీ, తనకు డ్యాన్స్ రాదని సంపూర్ణేష్ బాబు అన్నాడు. ప్రతిసారి తాను ఏది అవసరమో అదే నేర్చుకుని, అక్కడే మర్చిపోతానని తెలిపాడు. తనకు ఓ నటుడు కావాలని చిన్నప్పటి నుంచీ కోరిక ఉండేదని, ఏకంగా హీరోనే అయిపోయానని హర్షం వ్యక్తం చేశాడు. తనకు సెంటిమెంట్లు అనేవి ఏవీ లేవని, కాలంతో పాటు తన పనిని తాను చేసుకుంటూ వెళ్లిపోతానంతేనని అన్నాడు.