: బిగ్ బాస్ వ్యాఖ్యాతగా అక్షయ్ కుమార్!


బిగ్ బాస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా సల్మాన్ ఖాన్ స్థానంలో అక్షయ్ కుమార్ రానున్నాడా? అంటే అవుననే బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. బుల్లితెరపై అత్యధిక రేటింగ్స్ సాధించే బిగ్ బాస్ రియాలిటీషో వ్యాఖ్యాతగా సల్మాన్ ఖాన్ అందర్నీ ఆకట్టుకున్నాడు. సోనీ టీవీ 2006లో నెదర్లాండ్స్ లో పాప్యులర్ షో అయిన బిగ్ బ్రదర్ రియాలిటీ షోను అనుకరిస్తూ బిగ్ బాస్ రియాలిటీ షోను తెరమీదికి తీసుకొచ్చింది. అనంతరం 2008 నుంచి ఆ షోను కలర్స్ ఛానెల్ ప్రసారం చేయడం ఆరంభించింది.

ఇప్పటి వరకు బిగ్ బాస్ కలర్స్ లో వింటర్ సీజన్ లోనే వస్తోంది. సుమారు రెండున్నర నెలలపాటు సాగే ఈ రియాలిటీ షోలో ఒకే ఇంట్లో ఉండేవారి మధ్య గిల్లికజ్జాలు పెడుతూ, ఆటలాడిస్తూ, పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో చెప్పే వాస్తవాల ఆటే బిగ్ బాస్. ఇప్పటివరకు పది సీజన్లు పూర్తి చేసుకుని 11వ సీజన్ లోకి అడుగు పెడుతోంది. తొలి భాగానికి బాలీవుడ్ హాస్య నటుడు అర్షాద్ వార్సీ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. తరువాతి భాగానికి శిల్పా శెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

మూడో భాగానికి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా ఆకట్టుకున్నారు. అనంతరం సల్మాన్ అభిమానులను అలరించాడు. ఆ తరువాత సంజయ్ దత్ కూడా షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ తరువాత సల్మాన్ ఆ షోకు అధికారిక హోస్ట్ గా మారాడు. సీజన్ 9లో చివరి నాలుగైదు ఎపిసోడ్లు వ్యక్తిగత కారణాల వల్ల సల్మాన్ స్థానంలో ఫరాఖాన్ వచ్చింది. కానీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో పదో సీజన్ కు మళ్లీ సల్మాన్ నే తీసుకొచ్చారు నిర్వాహకులు.

ఇప్పుడు 11వ సీజన్ కు కూడా సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే సల్మాన్ చేతిలో సినిమాలు ఎక్కువ ఉండడంతో బిగ్ బాస్ కు సమయం కేటాయించలేనని తప్పుకున్నాడు. దీంతో కలర్స్ టీవీ ప్రతినిధులు సల్మాన్ స్థానాన్ని అక్షయ్ తో భర్తీ చేయనున్నారు. సల్మాన్ స్థానాన్ని అక్షయ్ అన్నిరకాలుగా భర్తీ చేయగలడని వారు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News