: ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది... పార్లమెంటు సెంట్రల్ హాల్ లో జీఎస్టీని ప్రారంభించిన రాష్ట్రపతి, ప్రధాని!
ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది. అతిపెద్ద ఆర్ధిక సంస్కరణ 'జీఎస్టీ'ని అమలు చేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకటించింది. వస్తుసేవల బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠిచేస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ నొక్కి వక్కాణించారు. రాజ్యాంగం ఆమోదానికి సాక్షీభూతంగా నిలిచిన ప్రదేశంలోనే జీఎస్టీని అమలులోకి తెస్తున్నామని ప్రధాని తెలిపారు.
ప్రాచీన భారత దేశం ఆర్థికంగా బలమైనదని, ఇప్పుడు నవీన భారత దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి జీఎస్టీని అమలు చేస్తున్నామని అరుణ్ జైట్లీ తెలిపారు. జీఎస్టీతో నవశకం మొదలైందని వారు పేర్కొన్నారు. దేశం మొత్తం ఒకే పన్ను విధానం అమలులో అడ్డంకులు ఉంటాయని, వాటిని అధిగమించాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. సమస్యలను అధిగమించేందుకు సమన్వయంతో పని చేయాలని రాష్ట్రపతి తెలిపారు. అరుణ్ జైట్లీ, ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగాలు ముగిసిన అనంతరం జీఎస్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఎన్నేళ్లో వేచిన ఉదయం వచ్చిందని బీజేపీ కార్యకర్తలు పేర్కొన్నారు.