: మోదీజీ! జీఎస్టీపై మీరు చెప్పిన మాటలు మీరే మర్చిపోయారే!: కాంగ్రెస్ విమర్శలు
ఒకప్పుడు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను వ్యతిరేకిస్తూ, దాని అమలు అసాధ్యమని చెప్పిన నరేంద్ర మోదీ, ఇప్పుడు తన వ్యాఖ్యలను తానే మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘జీఎస్టీపై మోదీ, బీజేపీ నిజంగా ఏమనుకుంటున్నారో చూడండి’ అని పోస్ట్ చేసిన ఈ వీడియోలో మోదీ ఎప్పుడు ఆ విషయాన్ని మాట్లాడారనే దానిని ఆ ట్వీట్ లో స్పష్టంగా పేర్కొనలేదు.
అయితే, తగిన మౌలిక సదుపాయాలు లేకుండా జీఎస్టీ అమలు అసాధ్యమంటూ ఆ వీడియోలో మోదీ చెప్పడం స్పష్టంగా ఉంది. ‘జీఎస్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కాదు. సరైన మౌలిక సదుపాయాలు లేకుండా దీనిని అమలు చేయడం అసాధ్యం. జీఎస్టీపై బీజేపీ, గుజరాత్ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్నది ఒకటే..ఇది విజయవంతం కాదు’ అని మోదీ పేర్కొన్నారు.
మరో ట్వీట్ లో..‘మోదీజీ.. మీ మాటలు మీరే ఎంత త్వరగా మర్చిపోయారు. సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా జీఎస్టీని ఎలా తీసుకువస్తున్నారు?’ అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. కాగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీఎస్టీని మోదీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వీడియో కూడా నాటిదే కావచ్చు.