: నోరు విప్పని నరేంద్ర మోదీని మార్చిన ఒకే ఒక్క నినాదం!


నరేంద్ర మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశవ్యాప్తంగా సుమారు 60 ఘటనల్లో ముస్లింలపై దాడులు జరిగాయి. వీటిల్లో అత్యధికం గో సంరక్షణ పేరిట జరిగినవే. ఈ దాడుల్లో 16 మంది చనిపోగా, మరెంతో మంది గాయపడ్డారు. కేరళ, యూపీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో గో సంరక్షకులు దాడులకు తెగబడ్డారు. అయితే, తన మూడేళ్ల పాలనలో గో సంరక్షకులకు వ్యతిరేకంగా గానీ, అనుకూలంగా గానీ ప్రధాని ఎన్నడూ ప్రస్తావించలేదు.

గోవుల ప్రస్తావన వస్తే, వాటిని సంరక్షించుకోవాలని, పూజించాలని, వాటి కోసం ఆశ్రమాలు కట్టిస్తామని చెబుతూ వచ్చారే తప్ప, వేరే ప్రస్తావనలు తేలేదు. అటువంటి మోదీ, నిన్న అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమంలో ఒక్కసారిగా గో సంరక్షకులు, గో సంరక్షణ సమితులు చేస్తున్న దాష్టీకాలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. గోవులను రక్షిస్తున్నామన్న ముసుగులో హింసాకాండకు దిగితే సహించే సమస్య లేదని, కఠిన చర్యలు తప్పవని కాస్త కటువు వ్యాఖ్యలే చేశారు. ఇవన్నీ బీజేపీ, ఆ పార్టీ అనుబంధ సంస్థలను ఉద్దేశించి చేసినవే అనడంలో సందేహం లేదు.

ఇక మూడేళ్ల తరువాత మోదీ నోటివెంట ఈ మాటలు రావడాన్ని దేశంలోని అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. అసలు మోదీ గో సంరక్షకులకు వ్యతిరేకంగా హెచ్చరికలు ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది? మూడేళ్ల తరువాత ఆయన మనసు మార్చిన ఘటన ఏంటి అన్న విషయాలు పరిశీలిస్తే, ఇటీవల ఢిల్లీలోని ఓ రైలులో మరో నలుగురు స్నేహితులు ప్రయాణిస్తుంటే, ఆవు మాంసం తిన్నారని ఆరోపిస్తూ, వారిని చావగొట్టారు. జువేద్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మరణించాడు. ఇది ఢిల్లీ నుంచి ఎన్నో నగరాల్లో కలకలం రేపగా, సోషల్ మీడియానూ కుదిపేసింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి 'ఇట్స్ నాట్ మై నేమ్' అనే ప్లకార్డులు చూపుతూ ర్యాలీలు నిర్వహించారు. దీని ప్రభావం ప్రభుత్వంపై ఎంతగా పడిందంటే, హిందుత్వ దాడులపై ఉద్యమాలు ఎన్ని జరిగినా నోరు విప్పని మోదీ, దాడులపై తొలిసారి నోరు విప్పారు.

ఇక మరో కారణం, దేశంలో 14 శాతంగా ఉన్న ముస్లిం ఓటర్లు, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచారు కాబట్టే అంత ఘనవిజయం సొంతమైందనడంలో సందేహం లేదు. ఈ తరహా దాడులతో ముస్లిం వర్గం ఓటర్లు పార్టీకి దూరమైతే వచ్చే నష్టాన్ని తెలుసుకోలేనంత అమాయకుడు మోదీ కాదు. అందుకే మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాల్సిన ఆయన, హిందుత్వం పేరిట జరుగుతున్న దాడులకు చెక్ పెట్టాలని బలంగానే నిర్ణయించుకుని, అందుకు తొలి అడుగుగా ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News