: ఆల్టో మరో ఘనత... ఐదు నెలల్లోనే లక్ష యూనిట్ల అమ్మకాలు
ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే చిన్నకారు ఆల్టో మరో రికార్డును నెలకొల్పింది. ఈ సంవత్సరం తొలి ఐదు నెలల వ్యవధిలో లక్ష యూనిట్లను విక్రయించామని సంస్థ తెలిపింది. బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ కారుగా నిలిచిన ఆల్టోను మారుతి సుజుకి సంస్థ సెప్టెంబర్ 2000లో భారత మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో తొలిసారి కారు కొనాలని భావించే వారు తొలుత చూసేది దీనివైపేననడంలో సందేహం లేదు. ఆల్టోను కొనుగోలు చేస్తున్న వారిలో 25 శాతం మంది 30 లోపు వయసున్న యువకులే. ఇక ఈ కారు ఎగుమతులూ సంతృప్తికరంగానే సాగుతున్నాయి.
ఆల్టో అందుబాటులోకి వచ్చిన తరువాత, ఈ 17 సంవత్సరాల్లో ఎన్నో డిజైన్ మార్పులను చేసుకుంటూ నిత్య నూతనంగా ముస్తాబవుతూనే ఉంది. ప్రస్తుతం ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్లలో ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ టెక్నాలజీ, ఆప్షనల్ ఎయిర్ బ్యాగ్స్ తోనూ లభిస్తోంది. భారతీయ రోడ్లకు, ఇక్కడి పరిస్థితులకు సరిగ్గా నప్పేలా ఉండటమే ఈ కారు విజయవంతానికి కారణం. ఇటీవలి కాలంలో మాత్రం రెనాల్ట్ నుంచి వచ్చిన క్విడ్ వంటి న్యూ ఏజ్ కార్లు, ఆల్టోకు గట్టి పోటీని ఇస్తున్నాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కూడా చిన్నకార్ల బరిలో సత్తా చాటుతోంది. అయినా, ఆల్టోకు ఆదరణ తగ్గకపోవడం గమనార్హం.