: ‘పోలవరం’పై ఉండవల్లి వ్యాఖ్యలు అవాస్తవం: మంత్రి దేవినేని
వైఎస్ రాజశేఖరెడ్డి మరో ఏడాది పాటు బతికుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను మంత్రి దేవినేని ఉమా కొట్టిపారేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుపై ఉండవల్లి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాని, వైఎస్సార్సీపీ అధినేత జగన్ డైరెక్షన్ లో ఆయన నడుస్తున్నాడని ఆరోపించారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలంతా పోలవరం ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా ఉండవల్లితో పాటు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, వైఎస్ జగన్మోహన్ రెడ్లను ఉద్దేశించి, '2009 నుంచి 2013 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు ఆగిపోయాయి? ఎందుకు బేరసారాలు కుదర్లేదో రాష్ట్ర ప్రజలకు చెప్పండి. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ‘పోలవరం’ టెండర్లు ఫైనలయ్యాయి. మేము అధికారంలోకి రాగానే, పోలవరం కల సాకారమై పనులు వేగవంతంగా సాగుతూ ఉంటే మాపై బురదజల్లే కార్యక్రమానికి ఈరోజు కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు.. దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని దేవినేని అన్నారు.