: దూడను తరలిస్తోన్న వ్యానుని అడ్డుకున్న హిందూరక్షక దళాలు... పళనిలో ఉద్రిక్తత
తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో పళని పట్టణంలో కొందరు దూడలను తరలిస్తున్నారని తెలుసుకున్న హిందూ రక్షక దళాలు వాటిని అడ్డుకున్నారు. ఆ దూడలను తరలిస్తున్న వ్యానును ముందుకు కదలనివ్వకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని వారిని అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఆ రాష్ట్రంలోని పళని, దిండిగల్ ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాల కోసం పశువులను తరలిస్తుంటారు. అయితే, ఆ ప్రాంతంలో అక్రమంగా గోవుల తరలింపు జరుగుతోందని హిందూ రక్షక దళం ఆరోపిస్తోంది. ఆ ప్రాంతాల్లో తరుచుగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.