: 'స్పైడర్‌మేన్ హోం కమింగ్' హిందీ ట్రైలర్ విడుదల... టైగర్ ష్రాఫ్ గాత్రంపై పెదవి విరిచిన అభిమానులు
జూలై 7న విడుదలకు సిద్ధమైన మార్వెల్ వారి స్పైడర్‌మేన్ హోం కమింగ్ సినిమా హిందీ ట్రైలర్ విడుదలైంది. ఇందులో స్పైడర్‌మేన్ పాత్రకి బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ గాత్రదానం చేశారు. అయితే ఈ పాత్రకి టైగర్ ష్రాఫ్ చేత డబ్బింగ్ చెప్పించడం వల్ల కొత్తదనం ఏం రాలేదని, మామూలు ఇంగ్లిష్ డబ్బింగ్ సినిమాలాగే ఉందని అభిమానులు పెదవి విరుస్తున్నారు. `ఎ ఫ్లయింగ్ జాట్` సినిమా ద్వారా చిన్న పిల్లల్లో సూపర్ హీరో ఇమేజ్ సంపాదించుకున్న టైగర్ ష్రాఫ్‌తో స్పైడర్‌మేన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించడం కలిసొస్తుందని నిర్మాతలు భావించారు. కానీ ట్రైలర్లో కొత్తదనం ఏం లేదని వస్తున్న వార్తలతో నిరుత్సాహపడుతున్నారు.
`నేను స్పైడర్‌మేన్ సినిమాలు చూస్తూ పెరిగాను. నాకు కూడా అలా ఎగరాలని, సాహసాలు చేయాలని ఉండేది. ఈ సినిమాకి గాత్రదానం చేయడం వల్ల నా కోరిక సగం తీరింది` అని ట్రైలర్ విడుదల కార్యక్రమంలో టైగర్ ష్రాఫ్ చెప్పారు. జాన్ వాట్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి భారత్‌లో మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలవనుంది.