: నిఫ్ట్ ఉద్యోగాన్ని వదిలేసిన మాజీ ఎంపీ
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఎంపికవడంతో మాజీ బీజేపీ ఎంపీ చేతన్ చౌహాన్ తన నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఈ పదవీ బాధ్యతలను చేతన్ 2016 జూన్ నుంచి నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో రాజీవ్ వి. షాను నిఫ్ట్ చీఫ్‌గా నియమిస్తూ కేంద్ర జౌళి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నిఫ్ట్ 2006 చట్టం ప్రకారం ఈ పదవి నిర్వహించేవారిని రాష్ట్రపతి నియమిస్తారు. ఈ పదవికి విద్యావేత్తను లేదా శాస్త్రవేత్తని నియమించాలి. 2016లో మాజీ క్రికెటర్ అయిన చేతన్ చౌహాన్‌ను నియమించినపుడు ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. 1986లో స్థాపించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వ్యవహారాలను కేంద్ర జౌళి శాఖ పర్యవేక్షిస్తుంది.