: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. జూలై 4న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆపై 4 నుంచి 18 వరకూ నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఆపై మూడు రోజుల వరకూ అంటే 21వ తేదీ వరకూ గడువు ఉంటుందని పేర్కొంది. ఆగస్టు 5న ఎన్నికలు జరుగుతాయని, అదే రోజున ఓట్లను లెక్కించి ఫలితాలను వెలువరిస్తామని ఈసీ వెల్లడించింది.
కాగా, ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఇదిలావుండగా, రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్న ఎన్డీయే, ఉపరాష్ట్రపతి పదవికి ప్రస్తుత మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఉప రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులు కలసి ఎన్నుకుంటారు.