: జైల్లో ఇంద్రాణిని తీవ్రంగా కొట్టి హింసించారు: వైద్య నివేదిక సంచలనం
తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైల్లో ఉన్న ఇంద్రాణి ముఖర్జియాను జైలు అధికారులు బలమైన ఇనుప ఆయుధాలతో కొట్టి హింసించారని వైద్యులు సంచలన నివేదికను ఇచ్చారు. ఆమె చేతులపై, ఇతర అవయవాలపై గాయాలు ఉన్నాయని అన్నారు. నిన్న కోర్టుకు వచ్చిన ఇంద్రాణి ముఖర్జియా, బైకుల్లా జైల్లో జరిగిన ఘటనలను వివరిస్తూ, జైలు అధికారుల దాష్టీకాలను ప్రస్తావించారు.
తనను తీవ్రంగా కొట్టారని ఆమె ఆరోపించగా, వైద్యుల పరీక్షల నిమిత్తం ఆదేశించిన న్యాయస్థానం, జైలు అధికారులపై ఫిర్యాదు చేసే అవకాశం ఇస్తున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఇంద్రాణిని పరీక్షించిన వైద్యులు, ఆమెను సుత్తి వంటి ఆయుధాలతో కొట్టారని, ఎముకలు మాత్రం విరగలేదని తెలిపారు. కాగా, బైకుల్లా జైల్లో షైతీ అనే మహిళను దారుణాతి దారుణంగా హింసించిన జైలు అధికారుల దాష్టీకాన్ని తాను ప్రత్యక్షంగా చూసి ప్రశ్నించినందునే తనపై దుర్మార్గంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదు చేశారు.