: వైకాపాలో చేరిన భూమా నాగిరెడ్డి సన్నిహితుడు గోపీనాథరెడ్డి!
తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల ఉప ఎన్నికల్లో నిలబడ్డ బ్రహ్మానందరెడ్డి, అసలు భూమా నాగిరెడ్డికి వారసుడే కాదని వైకాపా తరఫున బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ బాల పకీరయ్య, నంద్యాల ముఖ్య నేతల్లో ఒకరు, భూమా అనుచరుడైన గోపవరం గోపీనాథరెడ్డి సహా ఏడుగులు కౌన్సిలర్లు, 150 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు వైకాపాలో చేరగా, వారితో కలసి శిల్పా మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశంలోని తన వర్గమంతా తనకే మద్దతు ఇవ్వనున్నారని చెప్పిన ఆయన, నంద్యాల మునిసిపల్ చైర్ పర్సన్ సులోచనను పదవి నుంచి దించుతామని టీడీపీ చేస్తున్న సవాల్ ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, తెలుగుదేశం నేతలు ఏ తేదీ చెప్పినా బల ప్రదర్శనకు సిద్ధమని అన్నారు. భూమా నాగిరెడ్డికి ఆయన కుమారుడు, కుమార్తెలే వారసులు తప్ప ఇతరులు వారసులు కాదని చెప్పారు.
తాను వైకాపాలో చేరడానికి గంట ముందు కూడా పలువురు మంత్రులు తనతో మాట్లాడి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించిన ఆయన, అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీలో తాను చేరానంటే, ఎంతో సాహసోపేతంగా వ్యవహరించినట్లని అన్నారు. తెలుగుదేశం పార్టీ పతనం నంద్యాల ఉప ఎన్నిక నుంచే ప్రారంభమవుతుందని శిల్పా హెచ్చరించారు.