: ఘటికురాలు... భూమికి 39,000 అడుగుల ఎత్తులో జననం!
కాన్పు జరిగే సమయంలో గర్భిణి ఊపిరి బలంగా తీసుకుంటుంది. పరిస్థితులన్నీ సౌకర్యవంతంగా ఉండాలి, అలా జరిగితే సుఖప్రసవమవుతుంది. అయితే ప్రసవానికి సౌకర్యాలు అంతంతమాత్రమే ఉన్న విమానంలో భూమికి సరిగ్గా 39,000 అడుగుల ఎత్తులో అద్భుతం జరిగినట్టుగా ఒక బిడ్డ జన్మించింది. అమెరికాలోని ఫ్లోరిడాలోని ఫోర్ట్ లూధర్ డేల్ నుంచి టెక్సాస్ వెళ్తున్న స్పిరిట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం భూమికి సరిగ్గా 39,000 అడుగుల ఎత్తులో ఉండగా, ప్రయాణికుల్లో ఒకరైన గర్భిణి క్రిష్టీనా పెంటోన్ (35) కు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులు, విమానసిబ్బంది ఆందోళన చెందారు.
అయితే అదృష్టం కొద్దీ ప్రయాణికుల్లో ఒక శిశువైద్యుడు, నర్సు కూడా ప్రయాణిస్తుండడంతో ఆమె సుఖప్రసవానికి సహకరించారు. దీంతో నొప్పులు మొదలైన అరగంటకే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నొప్పులు ఎక్కువ కావడంతో ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించేందుకు విమానం దారి మళ్లించిన సిబ్బంది, సుఖప్రసవం కావడానికి తోడు వైద్యుడు భరోసా ఇవ్వడంతో విమానాన్ని మళ్లీ గమ్యస్థానానికి మళ్లించారు. కాగా, 39,000 అడుగుల ఎత్తులో సాధారణంగా కాన్పు జరగడం అద్భుతమేనని నిపుణులు పేర్కొంటున్నారు.