: చైనాకు ఇలా చెక్ పెట్టిన భారత్.. ఉత్తరాఖండ్ మీదుగా మానస సరోవర్ యాత్ర కొనసాగింపు
అర్థంపర్థం లేని కారణాలతో మానస సరోవర్ యాత్రను అడ్డుకోవాలని చూసిన చైనాకు భారత్ చెక్ చెప్పింది. ఉత్తరాఖండ్ ద్వారా యాత్రికులను కైలాశ్ మానస సరోవరం పంపించే ఏర్పాటు చేసింది. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు యాత్రికులను అనుమతించేది లేదని చైనా తేల్చి చెప్పింది. దీంతో సిక్కింలోని నాథు లా పాస్ వద్ద యాత్రికులు నిలిచిపోయారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించిన ప్రభుత్వం ఉత్తరాఖండ్ ద్వారా యాత్రికులను పంపిస్తోంది.
ఇప్పటికే 56 మందితో కూడిన మొదటి బృందం యాత్ర అనంతరం తిరుగుపయనమైనట్టు యాత్రను కోఆర్డినేట్ చేస్తున్న నోడల్ ఏజెన్సీ కుమోన్ మండల్ వికాశ్ నిగమ్ (కేఎంవీఎన్) అధికారులు తెలిపారు. పితోర్‌గఢ్ సమీపంలోని ధర్చులాలో ఉన్న లిపులేఖ్ పాస్ ద్వారా యాత్రికుల ప్రయాణం సాగినట్టు తెలిపారు. ఇప్పటికే తొలి బ్యాచ్‌కు చెందిన 56 మంది యాత్ర అనంతరం బుధవారం తిరుగు పయనం అయినట్టు వివరించారు. 56 మందితో కూడిన మూడో బ్యాచ్ కూడా చైనా భూభాగంలో అడుగుపెట్టినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం చైనాలోనే ఉన్న రెండో బృందం మరికొన్ని రోజుల్లో తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుందని తెలిపారు. ఉత్తరాఖండ్ ద్వారా యాత్ర సాఫీగా సాగుతోందని, సమస్యలు ఏమీ లేవని కేఎంవీఎన్ డైరెక్టర్ ధీరజ్ గార్బియల్ పేర్కొన్నారు.