: యువతిపై యోగి సంస్థకు చెందిన వ్యక్తుల సామూహిక అత్యాచారం!
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. సాక్షాత్తు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువవాహిని సంస్థకు చెందిన ముగ్గురు కార్యకర్తలు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన బరేలీ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, హిందూ యువవాహిని కార్యకర్త అయిన అవినాష్ తన సహ కార్యకర్తలైన అనిల్ సక్సేనా, జితేంద్రలను దీపక్ అనే వ్యక్తి ఇంటికి పిలిచాడు. అవినాష్, అనిల్, జితేంద్రలు కలసి అక్కడ ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు.
ఘటన జరిగిన అనంతరం దీపక్ తన సోదరుడు గౌరవ్ తో వచ్చి అత్యాచారానికి పాల్పడ్డ అవినాశ్ ను పోలీసులకు అప్పగించాడు. విషయం తెలుసుకున్న హిందూ యువవాహిని ప్రాంతీయ అధ్యక్షుడు, నగర విభాగం అధ్యక్షుడు, బీజేపీ నగర అధ్యక్షుడు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ధర్నా చేశారు. ఈ క్రమంలో ఎస్ఐను కూడా కొట్టారు. జరిగిన ఘటనలపై నగర్ ఎస్పీ రోహిత్ సింగ్ మాట్లాడుతూ, గ్యాంగ్ రేప్ కేసుతో పాటు, ఎస్ఐను కొట్టినవారిపై కూడా కేసులను నమోదు చేశామని చెప్పారు.