: లేవండి.. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధాని వస్తున్నారు.. మోదీని కీర్తిస్తున్న ఇజ్రాయెల్ పత్రికలు!


భారత ప్రధాని నరేంద్రమోదీని ఇజ్రాయెల్ దినపత్రికలు ఆకాశానికెత్తేస్తున్నాయి. ఆయనను ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానిగా కీర్తిస్తున్నాయి. త్వరలో మోదీ ఇజ్రాయెల్‌‌‌లో పర్యటించనున్న నేపథ్యంలో ‘‘లేవండి: ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధాని వస్తున్నారు’’ అని ఇజ్రాయెల్‌లోని ప్రముఖ బిజినెస్ డైలీ పేర్కొంది. ఆ దేశంలో పర్యటించనున్న తొలి భారత  ప్రధాని మోదీయే కావడం గమనార్హం.

ఇండో-ఇజ్రాయెల్ సంబంధాల గురించి ప్రస్తావించిన పత్రిక ఇటీవల ఆ దేశంలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రస్తావించింది. ఆయన పర్యటనపై ఇజ్రాయెల్ వాసులు బోలెడు ఆశలు పెట్టుకున్నారని, అయితే వారి ఆశను ట్రంప్ అడియాస చేశారని పేర్కొంది. 125 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ ఓ గొప్ప నాయకుడని, ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాధి నేత అయిన ఆయనకు ఊహించని స్థాయిలో పాప్యులారిటీ ఉందని పేర్కొంది.

మిగతా పేపర్లు కూడా మోదీ రాక సందర్భంగా కథనాలు ప్రచురించాయి. జూలై 4 నుంచి మోదీ మూడు రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.  మోదీ ప్రపంచంలోని చాలామంది దేశాధినేతల్లాంటి వారు కారని, ఆయన అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని మరో పత్రిక పేర్కొంది. ఇజ్రాయెల్ పర్యటనలో మోదీ పాలస్తీనా పరిపాలనా కేంద్రమైన రమల్లా సిటీని సందర్శించేందుకు నిరాకరించారని, పాలస్తీనియన్ అథారిటీ (పీఏ) చీఫ్ మొహ్‌మౌద్ అబ్బాస్‌ను, కానీ పీఏ నేతలను కానీ ఆయన కలుసుకోబోరని పేర్కొంది.

  • Loading...

More Telugu News