: ధోనీతో ఫొటో దిగుతామని నేనే అడిగా: పాక్ కెప్టెన్ సర్ఫరాజ్


పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కుమారుడు అబ్దుల్లాని ఎత్తుకుని టీమిండియా క్రికెటర్ ధోనీ దిగిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో ఇటీవల హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలో ధోనీ పక్కనే సర్ఫరాజ్ కూడా నిలబడి ఉన్నాడు. అయితే, ఈ ఫొటోను ధోనీ కానీ, సర్ఫరాజ్ గానీ తమ ఖాతాల ద్వారా పోస్ట్ చేయలేదు. కానీ, ఆ ఫొటో బయటకు రావడం, అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా చూడడం తెలిసిందే.

ఈ క్రమంలో, ఈ ఫొటోను ఏ సందర్భంలో దిగామనే విషయాన్ని సర్ఫరాజ్ తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం ఆ రోజున లండన్ లో ఉన్నామని, రెండు జట్లకు ఒకే హోటల్ లో బస ఏర్పాటు చేశారని చెప్పాడు. ఓ రోజు తన కుటుంబసభ్యులతో కలిసి లాబీలో కూర్చుని ఉండగా, ధోనీ అటుగా వెళ్లడాన్ని గమనించి, వెంటనే, అతని వద్దకు వెళ్లానని, తమ చిన్నారి అబ్దుల్లాతో కలిసి ఓ ఫొటో దిగుతానని ధోనీని కోరగా, అందుకు, ఆయన ఒప్పుకున్నాడని చెప్పాడు. తన తండ్రి సాధించిన విజయాలకు సంబంధించిన జ్ఞాపకాలను తన బిడ్డ అబ్దుల్లా పెద్దవాడైన తర్వాత చూపించేందుకే ఇలా ఫొటోలు తీసి భద్రపరుస్తున్నట్టుగా సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News