: సోషల్ మీడియా ప్రపంచంలోకి మీరా కుమార్
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ సామాజిక మాధ్యమాల్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని రాష్ట్రపతి ఎన్నికల అప్‌డేట్లను ఎప్పటికప్పుడు షేర్ చేయనున్నారు. మొదటి ట్వీట్‌గా ఆమె ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేశారు. తర్వాత రెండో ట్వీట్‌లో ఎన్నికల అప్‌డేట్ల కోసం తన ఫేస్‌బుక్ పేజీని ఫాలో అవ్వాలని దానికి సంబంధించిన లింక్ పోస్ట్ చేశారు.
ఎన్నికల నామినేషన్ చివరి రోజైన బుధవారం నాడు ఆమె నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆమెకు తోడుగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గేలు వెళ్లనున్నట్టు సమాచారం. వీరితో పాటు మీరా కుమార్ అభ్యర్థిత్వానికి మద్ధతు పలుకుతున్న ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఐఎం తరఫున సీతారాం ఏచూరి, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హాజరు కానున్నారు.