: సివిల్స్ ర్యాంకర్ గోపాలకృష్ణ అంగవైకల్యాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్
తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి రిజర్వేషన్ పొందాడని ఆరోపిస్తూ సివిల్స్-2016 లో మూడో ర్యాంక్ సాధించిన రోణంకి గోపాలకృష్ణపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిపై విచారణ జరపాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో దాఖలు చేసిన పిల్ లో కోరారు. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లికి చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ణ ఈ పిల్ ను దాఖలు చేశారు. గోపాలకృష్ణకు ఎటువంటి అంగవైకల్యం లేదని, తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించి ఆ పరీక్షకు హాజరయ్యాడని, ఓబీసీ కేటగిరీకి చెందిన గోపాలకృష్ణ 45 శాతం మేర అంగవైకల్యం ఉన్నట్టు ధ్రువీకరణపత్రం సమర్పించాడని ఆ పిల్ లో ఆరోపించారు.
ఓబీసీలకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులు 110.66 కాగా, గోపాలకృష్ణకి 91.34 మార్కులే వచ్చాయని అన్నారు. ఓబీసీ కేటగిరిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్ కు గోపాలకృష్ణ అర్హత సాధించలేదని, వికలాంగ కోటా కింద అర్హత మార్కులు 75.34తో అర్హత సాధించాడని అన్నారు. అంతేకాకుండా, మెయిన్స్ లో సాధారణ అభ్యర్థులకు పరీక్షా సమయం మూడు గంటలు కాగా, వికలాంగ అభ్యర్థులకు నాలుగు గంటలు ఉంటుందని అన్నారు.
గోపాలకృష్ణ అంగవైకల్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పత్రికల్లో కూడా పలు కథనాలు వచ్చాయని, ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. గోపాలకృష్ణకు ఐఏఎస్ సర్వీసు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. కాగా, ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం రేపు విచారణ జరపనుంది.