: 'హద్దు'లు మీరుతున్న చైనా... సరిహద్దులో భారత్, చైనా సైనికుల ఢీ!
భారత్, చైనా సరిహద్దులో కలకలం చెలరేగింది. సిక్కిం-భూటాన్ సరిహద్దులో చైనా సైన్యం బరితెగించి ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో అలజడి చెలరేగుతోంది. అంతేకాదు కొన్నిరోజుల క్రితం అక్కడి ఇండియన్ చెక్‌పోస్టు ధ్వంసం అయింది. చైనా సైన్యం అక్రమంగా దేశంలోకి చొరబడే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇటీవలే చైనా సైన్యం కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన భారత యాత్రికులను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చైనా, భారత్ సైనికులకు మధ్య జరిగిన వివాదానికి సంబంధించి ఓ వీడియో సంచలనం కలిగిస్తోంది.
సిక్కింలోని భూటాన్ సరిహద్దు వద్ద చైనా సైన్యం భారత బలగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. తలపడడానికి వస్తున్నట్లు ప్రవర్తించింది. దీంతో భారత సైన్యం చైనా ఆర్మీని వెనక్కు నెట్టేసింది. చైనా సైన్యం ఉద్దేశపూర్వకంగానే సరిహద్దు వద్ద ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సిక్కిం-భూటాన్ సరిహద్దులోని ‘డోకా లా’ ప్రాంతంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మానస సరోవర యాత్రీకులను చైనా సైనికులు అడ్డుకున్న నేపథ్యంలో చైనా తీరును భారత్ తీవ్రంగా ఖండిస్తున్నందుకు గానూ చైనా ఈ చర్యకు పాల్పడిందనే వాదన వినపడుతోంది. సిక్కిం సరిహద్దులోని భూటాన్ స్వతంత్ర దేశంగా అవతరించిన విషయం తెలిసిందే. కానీ రెచ్చిపోతున్న చైనా ఇప్పటికే ఆ ప్రాంతంలోని కీలక భూభాగాలను స్వాధీనం చేసుకుంది.