: వాళ్లందరూ పూర్వజన్మలో మా అమ్మలో, నానమ్మలో!: ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్


ప్రకాశం జిల్లాలోని ఓ వృద్ధాశ్రమానికి చేయూత నిచ్చేందుకు వెళ్లిన ఫైట్ మాస్టర్ల సోదర ద్వయం రామ్- లక్ష్మణ్ అక్కడ సందడి చేశారు. ఒంగోలులోని బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమం ఉంది. పద్నాలుగేళ్లుగా ఈ ఆశ్రమాన్ని కోటమ్మ అనే మహిళ నిర్వహిస్తున్నారు. అయితే, నాలుగేళ్లుగా ఈ ఆశ్రమానికి రామ్ లక్ష్మణ్ సోదరులు తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్లిద్దరూ అక్కడికి వెళ్లారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. వారితో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం, సోదరులిద్దరూ డ్యాన్స్ చేస్తూ అక్కడి వృద్ధులను ఉల్లాసపరిచారు. ఓ వృద్ధురాలి చేతులు పట్టుకుని మరీ ఆమెతో సరదాగా కాసేపు డ్యాన్స్ చేయించారు.

 ‘ఈ వృద్ధాశ్రమంతో నాలుగైదేళ్లుగా మాకు అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్నవాళ్లు ఎవరో కాదు, పూర్వజన్మలో మా అమ్మలు, నానమ్మలే. నాలుగేళ్ల కిందట ఇక్కడికి ఓసారి వచ్చాం. అది వర్షాకాలం కావడంతో వృద్ధాశ్రమం లోపలికి చేరిన నీటిని కోటమ్మగారు ఎత్తిపారబోస్తున్నారు. దీంతో, మేము చలించిపోయాం. అప్పటి నుంచి మా వంతు సాయం చేస్తున్నాము’ అని రామ్ లక్ష్మణ్  చెప్పారు. సినిమా రంగంలో ఈ ఏడాది తమకు చాలా బాగుందని, భవిష్యత్తులో కూడా బాగుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News