: ఆగస్టులో రిటైర్మెంట్ గురించి ప్రకటిస్తా: సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సంచలన ప్రకటన
సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ సంచలన ప్రకటన చేశాడు. ఆగస్టులో తన క్రికెట్ రిటైర్మెంట్ పై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పాడు. '360 డిగ్రీస్' ఆటగాడిగా పేరొందిన డివిలియర్స్ అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఈ మధ్యకాలంలో ఎదురైన వైఫల్యమేనని తెలుస్తోంది. ప్రపంచ క్రికెట్ లో విధ్వంసకర బ్యాట్స్ మన్ లో ఒకడిగా పేరొందిన డివిలియర్స్ సారథ్యంలో సఫారీ జట్టు ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో నిరాశాజనక ప్రదర్శనతో తొలి రౌండ్ లోనే వెనుదిరిగింది.
తరువాత ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ తో పాటు టీ20 సిరీస్ ను కూడా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా చేరిన డివిలియర్స్ తన కెరీర్ పై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని అన్నాడు. సెప్టెంబర్ లో పర్యటనకు బంగ్లాదేశ్ జట్టు రానుందని, ఆలోగానే తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పాడు. సౌతాఫ్రికాకు వరల్డ్ కప్ తేవాలన్నది తన చిరకాల వాంఛ అని, అయితే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వరల్డ్ కప్ సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.