: అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయండి!: మీరా కుమార్
త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులు తమ అంతరాత్మ ఎలా చెబితే అలా ఓట్లు వేయాలని ఎలక్టోరల్ కోలీజియమ్ కు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థిని, మాజీ స్పీకర్ మీరా కుమార్ విజ్ఞప్తి చేశారు. జూలై 17న జరగనున్న ఎన్నికల్లో, మనసుకు నచ్చిన వారికి ఓటు వేయాలని ఆమె అభ్యర్థించారు. "ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా నిలిచే రాజ్యాంగాన్ని రక్షిస్తానని రాష్ట్రపతి ప్రమాణం చేయాల్సి వుంటుంది. స్వల్పకాల రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసే వారిని ఎన్నుకుంటే నష్టపోతాం" అని ఆమె అన్నారు.
కొలీజియంలోని ఓ సభ్యురాలిగా తాను ఈ విజ్ఞప్తిని చేస్తున్నానని, అందరమూ కలసి రాష్ట్రపతి ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దామని అన్నారు. కాగా, యూపీఏలో భాగంగా ఉన్న కొన్ని పార్టీలు ఎన్డీయే నిలిపిన రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఎన్డీయేలో భాగం కానప్పటికీ, బీజేడీ, ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ తదితర పార్టీలు కోవింద్ కు మద్దతిస్తామని చెప్పడంతో 10,98,903 ఎలక్టోరల్ ఓట్లలో 63 శాతం వరకూ ఆయనకు పడే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.